మే 1న లాడ్జిలో మకాం.. మే 3న కరీంనగర్లో గోల్డ్ రాబరీ!
“లాడ్జి లాజిక్”పై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన.. పోలీస్ నిఘాపై ప్రశ్నలు
తెలంగాణ వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో లాడ్జీలు అసాంఘిక శక్తులకు సేఫ్ షెల్టర్లుగా మారుతున్నాయా..? కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు దర్యాప్తులో బయటపడుతున్న అంశాలు ఇప్పుడు ఇదే అనుమానాన్ని బలపరుస్తున్నాయి. మే 3న కరీంనగర్లో సంచలనం సృష్టించిన గోల్డ్ రాబరీకి పాల్పడిన నిందితులు, రెండు రోజుల ముందే జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ధర్మపురిలో రెక్కీ.. కరీంనగర్లో దోపిడీ
కరీంనగర్ జ్యోతినగర్‌లో ఉన్న పీఎంజే జ్యువెలరీలో మే 3న ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఐదుగురు దుండగులు కస్టమర్ల వేషంలో షాపులోకి ప్రవేశించారు. తుపాకులతో సిబ్బందిని బెదిరించి, సుమారు కిలోకు పైగా బంగారం దోచుకెళ్లారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. సెక్యూరిటీ గార్డును కట్టేసి, నిమిషాల్లోనే పరారయ్యారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో పోలీసులు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించే క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
డూప్లికేట్ ఐడీలతో లాడ్జిలో బస
దర్యాప్తులో భాగంగా నిందితులు ధర్మపురిలోని ఓ లాడ్జీలో “సౌరవ్ కుమార్” పేరిట రెండు గదులు అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. జార్ఖండ్‌కు చెందిన డూప్లికేట్ ఆధార్ నంబర్‌ను ఐడీ ప్రూఫ్‌గా చూపడంతో నిర్వాహకులు ఎలాంటి క్రాస్ వెరిఫికేషన్ చేయకుండా రూములు ఇచ్చినట్లు సమాచారం.
మొదట నలుగురు, ఆ తర్వాత మరో వ్యక్తి కలిసి అక్కడ బస చేసినట్లు లాడ్జి సిబ్బంది తెలిపారు. భోజనం, ఇతర అవసరాల కోసం నగదు చెల్లింపులే చేయడంతో పాటు ఎక్కడా ఫోన్ నంబర్లు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. యూపీఐ లావాదేవీలను కూడా పూర్తిగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు అదే లాడ్జిలో గడిపిన నిందితులు రాబరీ జరిగిన రోజు ఉదయం గది ఖాళీ చేసి వెళ్లిపోయారని సమాచారం.
లాడ్జీలు నేరస్తులకు తాత్కాలిక అడ్డాలా?
కరీంనగర్లో దోపిడీ చేసి, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ధర్మపురిని షెల్టర్‌గా ఉపయోగించుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా లాడ్జీల నిర్వహణపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిబంధనల ప్రకారం ప్రతి లాడ్జీలో గెస్ట్ రిజిస్టర్ నిర్వహించడం, పూర్తి చిరునామా, మొబైల్ నంబర్, ఆధార్ వంటి వివరాలు నమోదు చేయడం తప్పనిసరి. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రికార్డులను భద్రపరచాలి. కానీ అనేక చోట్ల ఈ నిబంధనలు కేవలం నామమాత్రంగానే అమలవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో నేరస్తులు డూప్లికేట్ ఐడీలతో రూములు తీసుకుని, పని ముగిసిన తర్వాత ఎలాంటి ఆనవాళ్లు లేకుండా వెళ్లిపోతున్నారని పోలీసులు భావిస్తున్నారు. సరైన వెరిఫికేషన్ లేకపోవడం వల్ల దర్యాప్తు కూడా క్లిష్టమవుతోంది.
పోలీస్ నిఘాపై సందేహాలు
పట్టణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, నిరంతర పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ధర్మపురి, కొండగట్టు వంటి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో అనుమతి లేని లాడ్జీలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసుల నిఘా మరింత కట్టుదిట్టం కావాలని ప్రజలు కోరుతున్నారు. లాడ్జీల్లో దిగే ప్రతి వ్యక్తి వివరాలను క్రాస్ చెక్ చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించడం వంటి చర్యలు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పర్యవేక్షణ లేకపోతే ప్రమాదమే
ఈ ఘటనతో లాడ్జి నిర్వాహకుల బాధ్యతపై కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కేవలం ఐడీ తీసుకోవడమే కాకుండా, దాని నిజస్వరూపాన్ని ధృవీకరించడం, పూర్తి వివరాలను నమోదు చేయడం, అవసరమైతే స్థానిక పోలీసులకు సమాచారం అందించడం వంటి చర్యలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
లేదంటే లాడ్జీలు నేరస్తులకు సురక్షిత స్థావరాలుగా మారే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన ఘటనలు చోటుచేసుకునే అవకాశముందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
