తెలంగాణలో ఎండల ఎఫెక్ట్.. ఉత్తర జిల్లాలకు రెడ్ అలర్ట్!
తెలంగాణలో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మే 14, 15, 16 తేదీల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
తగినంత నీరు తాగడం, పలుచని దుస్తులు ధరించడం, నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రిని సంప్రదించాలని అధికారులు తెలిపారు.
