సిద్ధిపేటలో 50 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం – 100 ఎకరాలు దాటితే గ్రామానికి రూ.10 లక్షల ప్రోత్సాహకం: మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
హుస్నాబాద్‌లో మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం – నాలుగేళ్లు ఓపిక పడితే రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుందని మంత్రి వివేక్ వెల్లడి
సిద్ధిపేట, జూలై 10: సిద్ధిపేట జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును 50 వేల ఎకరాలకు విస్తరించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీస్ మరియు గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 14 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని, రైతులు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.
హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి డా. వివేక్ వెంకటస్వామితో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, దేశంలో వంటనూనెలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఆయిల్‌పామ్ సాగును విస్తరించడం అవసరమన్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో వంటనూనెల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఆయిల్‌పామ్ సాగు ప్రారంభించిన రైతులు తొలి నాలుగేళ్లు ఓపికగా సాగు కొనసాగిస్తే, ఆ తర్వాత దీర్ఘకాలికంగా మంచి ఆదాయం పొందే అవకాశముందని తెలిపారు. ప్రారంభ దశలో ప్రభుత్వం సబ్సిడీలు, రైతు భరోసా వంటి పథకాల ద్వారా రైతులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. వరి సాగుతో పోలిస్తే ఆయిల్‌పామ్‌కు తక్కువ నీరు అవసరమవుతుందని, హుస్నాబాద్ సమీపంలోనే ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉండటం రైతులకు అదనపు ప్రయోజనమని వివరించారు.
గత ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం అధికంగా వరి కొనుగోలు చేసిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం గోదాములు ధాన్యంతో నిండిపోయాయని, కేంద్రం బియ్యం ఎగుమతులకు అనుమతించకపోవడం, ఎఫ్‌సీఐ అదనపు ధాన్యం కొనుగోలు చేయని పరిస్థితుల్లో రైతులు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.
చెన్నూరు ప్రాంతంలో కూడా రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్న మంత్రి, ప్రజాప్రతినిధులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఆయిల్‌పామ్ ప్రయోజనాలను రైతులకు వివరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఒక గ్రామంలో 100 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు చేపడితే ఆ గ్రామానికి రూ.5 లక్షల ప్రోత్సాహకం అందజేస్తామని ప్రకటించారు. దీనిపై స్పందించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి కూడా మరో రూ.5 లక్షలు తన తరఫున అందిస్తానని ప్రకటించారు. దీంతో 100 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు చేసిన గ్రామానికి మొత్తం రూ.10 లక్షల ప్రోత్సాహకం లభించనుంది.
కార్యక్రమంలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతు సంపత్‌ను మంత్రులు సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శివయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
