రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్ఐ అరెస్ట్
చార్జిషీట్ త్వరగా దాఖలు చేసేందుకు డబ్బుల డిమాండ్
శిల్పనగర్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
కీసర, నవంబర్ 9: కీసర పోలీస్ స్టేషన్లో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసులో అనుకూలంగా చార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు త్వరగా ప్రక్రియ పూర్తి చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
బాధితుడి నుంచి రూ.2 లక్షల లంచం స్వీకరిస్తుండగా సోమవారం నాగారం పరిధిలోని శిల్పనగర్‌లో ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్ఐను పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ వెల్లడించారు.
లంచం డిమాండ్‌పై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా ప్రణాళిక ప్రకారం అధికారులు దాడి నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఘటనతో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది.
