‘Veer Bal Divas’ on 26th December

Community-verified icon

డిసెంబర్ 26న ‘వీర్ బాల్ దివస్’

సిక్కుల పదవ గురువైన శ్రీ గురుగోవింద్ సింగ్ ఇద్దరు చిన్న కుమారులైన (సాహెబ్‌‌జాదేలు) బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ ల ధైర్య, సాహసాలను, త్యాగాలను స్మరించుకుంటూ.. ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 26న ‘వీర బాల్ దివస్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. ఇందులో భాగంగా.. రేపు (డిసెంబర్ 26 , సోమవారం) ఢిల్లీలో.. వీర బాల్ దివస్ ను పురస్కరించుకుని ఘనంగా ‘షాబాద్ కీర్తన్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దాదాపు 3 వందల మంది బాల కీర్తనీలు ‘షాబాద్ కీర్తన్’ను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. అనంతరం దాదాపు 3వేల మంది చిన్నారుల ఆధ్వర్యంలో జరిగే మార్చ్ పాస్ట్ ను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు.
షాహెబ్‌జాదేల ధైర్య సాహసాలను, త్యాగాలను గుర్తుచేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరీ ముఖ్యంగా, విద్యార్థుల కోసం పాఠశాలలు, కాలేజీల్లో వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. రైల్వే స్టేషన్లు, పెట్రోల్ పంపులు, విమానాశ్రయాల్లో డిజిటిల్ ప్రదర్శనలను ఏర్పాటుచేయనున్నారు.
2022 జనవరి 9న శ్రీ గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. డిసెంబర్ 26ను ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 1704వ సంవత్సరంలో మొగలు నవాబ్ అయిన వజీర్ ఖాన్.. మతం మారాలంటూ ఇద్దరు షహజాదేలను చిత్రహింసలు పెట్టారు. అయినా ధర్మాన్ని మార్చుకునేందుకు 9 ఏళ్ల జోరావర్ సింగ్, 7 ఏళ్ల ఫతేసింగ్ నిరాకరించారు. 1704 డిసెంబర్ 26న వీరిద్దరు బలిదానం చెందారు. వీరి త్యాగాన్ని, ధైర్య, సాహసాలను స్మరించుకుంటూ కేంద్రం ఈ ఏడాది నుంచి డిసెంబర్ 26ను ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించనుంది.