చిక్కుల్లో వాట్సప్.. యూజర్ నేమ్ పై కేంద్రం నజర్..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తీసుకొస్తున్న యూజర్ నేమ్ సదుపాయంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రముఖుల పేర్లతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, దుర్వినియోగానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో దీనిపై దృష్టి సారించింది.
వాట్సప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్ ను కేంద్రం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ మోసాలు, వినియోగదారుల భద్రత కోణంలో సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఏదైనా ముప్పు పొంచి ఉందని తేలితే మెటాకు నోటీసు జారీ చేసే అవకాశముందని తెలిపాయి. జాతీయ భద్రత విషయంలో రాజీపడేది లేదని కేంద్రం స్పష్టంచేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఏమిటీ యూజర్ నేమ్ ఫీచర్…
ఫోన్ నంబర్ ప్రైవసీని కాపాడుతూ యూజర్ నేమ్ ఆప్షన్‌ను వాట్సప్ తీసుకొస్తోంది. దీనివల్ల యూజర్లు ఫోన్ నంబరును షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం యూజర్ నేమ్ ద్వారా సంభాషణలను జరపవచ్చు. ప్రస్తుతం యూజర్ నేమ్‌ను రిజర్వు చేసుకునేందుకు వాట్సప్ అనుమతిస్తోంది. యూజర్ నేమ్ లో 3 నుంచి 35 క్యారక్టర్లను అనుమతిస్తారు. అందులో సెలబ్రిటీలు, అత్యున్నత స్థాయి వ్యక్తుల పేర్లను అనుమతించబోరు. యూజర్ నేమ్వల్ల ఫోన్ నంబరు కనిపించదని, పెద్ద గ్రూపుల్లో మీరు యాడ్ అయినప్పుడు మీ ప్రైవసీకి రక్షణ లభిస్తుందనేది వాట్సప్ వాదన.
ఆందోళనలు ఏమిటి?
ఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండా చాట్ చేయడానికి వాట్సప్ తీసుకొచ్చిన యూజర్ నేమ్ సదుపాయంపై సైబర్ నిపుణులు ఆందోళనలు వ్యక్తంచేస్తున్నారు.
సుపరిచిత వ్యక్తుల పేర్లతో నకిలీ యూజర్‌నేమ్స్ సృష్టించి, ప్రజలను మోసం చేసేందుకు ఈ ఫీచర్ అవకాశం కల్పిస్తోందని హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏదో ఒక యూజర్నేము అంచనా వేసి నేరుగా మెసేజ్ చేసే అవకాశం ఉండటంతో స్పామ్ కాల్స్, సందేశాలు పెరిగే అవకాశం ఉందని సైబర్ నిపుణుల వాదన. ఫోన్ నంబర్లు గోప్యంగా ఉంచడం వరకు బాగున్నా.. మోసాలను అరికట్టడానికి తగిన భద్రతా చర్యలు లేకపోతే టెలిగ్రాం తరహా మోసాలకు వాట్సప్ వేదికగా మారుతుందన్న ఆందోళనలూ నెలకొన్నాయి.
