తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రులతో మంత్రి డా. జి. వివేక్ కీలక చర్చలు
న్యూఢిల్లీ, జూలై 27: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల విస్తరణ, కార్మిక సంక్షేమం, గనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ శక్తి (కార్మిక, శిక్షణ, ఉపాధి & ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి సోమవారం న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రాలు అందజేసి, కేంద్ర సహకారం కోరారు.
ముందుగా కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయతో సమావేశమైన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, తెలంగాణలో కార్మిక సంక్షేమ కార్యక్రమాల విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపు, కేంద్ర పథకాల అమలులో రాష్ట్రానికి మరింత సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పెంచే కార్యక్రమాలకు కేంద్రం నుంచి అవసరమైన మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని కలిసి రాష్ట్ర యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందించే అంశంపై చర్చించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల అభివృద్ధి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి రంగంలో తెలంగాణకు మరింత సహకారం అందించాలని కోరారు.
తదుపరి కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యంత కీలకమైన తాడిచెర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి స్థానిక యువతకు కనీసం 1,000 ఉద్యోగాలు కల్పించాలని, ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల ప్రజలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే నిర్వాసిత కుటుంబాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద సమగ్ర పునరావాసం, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సింగరేణి సంస్థలో పదవీ విరమణ పొందిన కార్మికుల సమస్యలను కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తక్కువ పెన్షన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది రిటైర్డ్ కార్మికులను దృష్టిలో ఉంచుకుని, వారికి కనీస నెలవారీ రూ.10 వేల పెన్షన్ అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా సింగరేణి విస్తరణ, కొత్త బొగ్గు గనుల అభివృద్ధి, గనుల ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రత్యేక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ సమర్పించిన వినతులను సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు. ముఖ్యంగా తాడిచెర్ల-2 ప్రాజెక్టు వేగవంతం, స్థానికులకు ఉద్యోగాల కల్పన, ఆర్అండ్ఆర్ అమలు, సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ అంశాలను సంబంధిత శాఖలతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, “తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల విస్తరణ, కార్మికుల సంక్షేమం, గనుల రంగ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తాం. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంపై నిరంతరం కృషి చేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం” అని పేర్కొన్నారు.
