తాడిచర్ల బ్లాక్-2, ఆర్కేపీ గనులకు పర్యావరణ అనుమతులు వేగవంతం చేయాలి: కేంద్రాన్ని కోరిన మంత్రి వివేక్
తాడిచర్ల బ్లాక్-2, ఆర్కేపీ గనులకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు ఇవ్వాలి
కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసిన మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కోసం కీలక ప్రాజెక్టులు
న్యూఢిల్లీ, జూలై 28: తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి కీలకమైన తాడిచర్ల బ్లాక్-2 బొగ్గు గని, ఆర్కేపీ (RKP) బొగ్గు గనుల ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి కోరారు.
న్యూఢిల్లీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్తో కలిసి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, తెలంగాణకు అత్యంత ప్రాధాన్యమైన గనుల ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడతాయని, వీటికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా తాడిచర్ల బ్లాక్-2 బొగ్గు గనికి పర్యావరణ అనుమతులు లభిస్తే వెయ్యికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి అవసరమైన బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. దీంతో పరిశ్రమలకు ఇంధన భద్రత కలగడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన ఆర్కేపీ (RKP) మైన్స్ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులను కూడా అత్యవసరంగా మంజూరు చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. ఈ రెండు గనుల ప్రాజెక్టులు తెలంగాణ గనుల రంగ అభివృద్ధికి, కొత్త పెట్టుబడుల ఆకర్షణకు, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాల సృష్టికి కీలకంగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ప్రతి కీలక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందేలా నిరంతరం సమన్వయంతో పనిచేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా అవసరమైన ప్రతి చర్యను ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు.
