చెన్నూరు ప్రజల సమస్యల పరిష్కారానికి ‘ఓపెన్ బాక్స్’
ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తా.. స్వయంగా పరిష్కరిస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి
చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు వినూత్నంగా ‘ఓపెన్ బాక్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, సూచనలను లేఖల రూపంలో ఈ బాక్స్‌లో వేయవచ్చు.
ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా ‘ఓపెన్ బాక్స్’ పనిచేస్తుందని మంత్రి తెలిపారు. బాక్స్‌కు ఉన్న తాళాన్ని స్వయంగా తానే తీసి, అందులోని లేఖలను పరిశీలిస్తానని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై నేరుగా స్పందించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
పారదర్శక పాలన, అవినీతికి తావులేని పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి వివేక్ తెలిపారు. రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమం మొదటిసారి చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల చుట్టూ తిరగకుండా నేరుగా తన దృష్టికి తీసుకురావడానికి ఈ ‘ఓపెన్ బాక్స్’ ఉపయోగపడుతుందని వివరించారు.
కోటపల్లి హైస్కూల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పర్యటనలో భాగంగా కోటపల్లి హైస్కూల్లో రూ.50 లక్షల CSR నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్
చెన్నూరు నియోజకవర్గంలోని పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి ఉచిత పోలీస్ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. చెన్నూరులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు.
ఈ కోచింగ్ సెంటర్‌కు దివంగత కాకా వెంకటస్వామి పేరు పెట్టారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ అందించడం ద్వారా వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత ఖరీదైన కోచింగ్ తీసుకోలేని పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉచిత శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీస్ ఉద్యోగాల్లో విజయం సాధించాలని మంత్రి వివేక్ ఆకాంక్షించారు.
