ఏడాదిన్నర చిన్నారికి ఛాతీలోకి తిరిగిన కడుపు
ఆపరేషన్ సమయంలో బయటపడిన అసలు సమస్య.. విజయవంతంగా చికిత్స
నూతన జీవితాన్ని అందించిన కిమ్స్ కడల్స్ కర్నూలు వైద్యులు
కర్నూలు, సెప్టెంబరు 11, 2026: పుట్టుకతో వచ్చిన సమస్య కారణంగా ఏడాదిన్నర వయసున్న చిన్నారి కడుపు ఛాతీలోకి తిరగబడటంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. కిమ్స్ కడల్స్ కర్నూలు వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి చిన్నారి ప్రాణాలను కాపాడారు. విజయవంతంగా చికిత్స అందించి చిన్నారికి నూతన జీవితాన్ని అందించారు. ఈ వివరాలను శస్త్రచికిత్స నిర్వహించిన పీడియాట్రిక్ సర్జన్ డా. సాయి కిరణ్ వెల్లడించారు.
కడప పట్టణానికి చెందిన ఏడాదిన్నర వయసున్న బాలికకు అకస్మాత్తుగా కడుపు ఉబ్బడం, నోటి నుంచి రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు కిమ్స్ కడల్స్ కర్నూలుకు తీసుకొచ్చారు. వైద్యులు వెంటనే సీటీ స్కాన్ నిర్వహించగా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. సాధారణంగా ఉండాల్సిన స్థానంలో కాకుండా కడుపు కింద నుంచి పైకి తిరిగి ఛాతీలోకి చేరినట్లు గుర్తించారు.
ఛాతీలో పేరుకుపోయిన ద్రవాన్ని తొలగించేందుకు వైద్యులు ప్రయత్నించగా, ట్యూబ్ పెట్టడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరకు సుమారు 700 మిల్లీలీటర్ల రక్తం కలిసిన ద్రవాన్ని బయటకు తీశారు. దీంతో కడుపుకు తీవ్రమైన సమస్య ఏర్పడినట్లు గుర్తించి, పరిస్థితి విషమించకుండా వెంటనే అత్యవసర శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు.
ఆపరేషన్‌లో బయటపడిన అసలు సమస్య
శస్త్రచికిత్స సమయంలో అసలు సమస్య బయటపడింది. చిన్నారి కడుపు తన చుట్టూ తానే తిరిగిపోయి, ప్లీహంతో కలిసి ఛాతీలోకి వెళ్లిపోయినట్లు వైద్యులు గుర్తించారు. పుట్టుకతోనే ఛాతీ, కడుపు మధ్య ఉండే డయాఫ్రమ్‌లో రంధ్రం ఉండటంతో కడుపు, ప్లీహం ఛాతీలోకి జారినట్లు నిర్ధారించారు.
కడుపుకు రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోయి ఉంటే కణజాలం దెబ్బతిని కడుపు పాడయ్యే ప్రమాదం ఉండేదని వైద్యులు తెలిపారు. అయితే సకాలంలో చికిత్స అందడంతో రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోలేదని, దీంతో కడుపును కాపాడగలిగామని చెప్పారు.
శస్త్రచికిత్స ద్వారా ఛాతీలోకి వెళ్లిన కడుపు, ప్లీహాన్ని తిరిగి సాధారణ స్థానంలోకి తీసుకొచ్చారు. ఛాతీ, కడుపు మధ్య ఉన్న రంధ్రాన్ని మూసివేయడంతో పాటు, భవిష్యత్తులో కడుపు మళ్లీ తిరగకుండా ఉండేందుకు దాన్ని లోపల సురక్షితంగా అమర్చినట్లు డా. సాయి కిరణ్ తెలిపారు.
వెంటిలేటర్‌పై చికిత్స
శస్త్రచికిత్స అనంతరం చిన్నారికి కొంతకాలం వెంటిలేటర్ సహాయం అవసరమైంది. మెదడుపై విషపదార్థాల ప్రభావంతో మూర్ఛలు రావడంతో పీఐసీయూ బృందం ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందించింది.
డా. వాసు బుర్లీ, డా. రవి కిరణ్, డా. దిలీప్ సత్య, డా. సాహితి జి చిన్నారిని నిరంతరం పర్యవేక్షించారు. రేడియాలజిస్ట్ డా. అరవింద్ రెడ్డి, అనస్థీషియా నిపుణురాలు డా. శ్రుతి వెన్నెల సహకారం అందించారు. వైద్య బృందం సమన్వయం, కుటుంబ సభ్యుల సహకారంతో చిన్నారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. అనంతరం పూర్తిగా కోలుకోవడంతో మంచి ఆరోగ్యంతో చిన్నారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
కడుపు ఉబ్బితే నిర్లక్ష్యం చేయొద్దు
కడుపు తన చుట్టూ తానే తిరిగిపోవడాన్ని గ్యాస్ట్రిక్ వోల్వులస్ అంటారని వైద్యులు తెలిపారు. దీనివల్ల కడుపుకు రక్త సరఫరా నిలిచిపోతే కణజాలం దెబ్బతిని ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
పుట్టుకతో ఛాతీ, కడుపు మధ్య ఉండే డయాఫ్రమ్‌లో రంధ్రం ఉండి కడుపు వంటి అవయవాలు ఛాతీలోకి జారడాన్ని డయాఫ్రమాటిక్ హెర్నియా అంటారని వివరించారు.
చిన్నారుల్లో అకస్మాత్తుగా కడుపు ఉబ్బడం, వరుసగా వాంతులు కావడం, పాలు తాగలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన నీరసం లేదా స్పృహలో మార్పు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ కేసులో సమస్యను సకాలంలో గుర్తించి అత్యవసర శస్త్రచికిత్స చేయడం వల్ల చిన్నారి ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు.
