ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో కొత్త వెలుగులు
చిన్నకంజర్లలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి
మరో రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రభుత్వ నిర్ణయం
సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా లబ్ధిదారుల ఇంట్లో కేక్ కట్ చేసి, కుటుంబంతో కలిసి భోజనం
పటాన్చెరు, నవంబర్ 9: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇప్పటికే రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని, మరో రెండు లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధి చిన్నకంజర్లలో ఆదివారం నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇందిరమ్మ ఇంట్లో కేక్ కట్ చేశారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని, వారితో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసిందన్నారు. 1970లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు అసైన్డ్ భూములు పంపిణీ చేయడంతో పాటు ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి పేదల సొంతింటి కలను నెరవేర్చిందన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో హామీలు ఇచ్చి ప్రజల నుంచి ఓట్లు పొందారని, అయితే ఆశించిన స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి, కాంట్రాక్టర్ల బిల్లులు, ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాలను పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాల అమలులో గత ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలందరికీ సొంత ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఇప్పటికే రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని, మరో రెండు లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
చిన్నకంజర్లకు చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు ఈశ్వరమ్మ గతంలో వర్షాకాలంలో ఇంట్లోకి నీరు చేరడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం సొంతంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడంతో ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు. లబ్ధిదారుల జీవితాల్లో వస్తున్న మార్పు, వారి ముఖాల్లో కనిపిస్తున్న ఆనందమే ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి అని అన్నారు.
పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి వివరించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అర్హులకు పెన్షన్లు, సన్నబియ్యం పంపిణీ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్నబియ్యం పంపిణీ చేయడం వల్ల కుటుంబాల నెలవారీ ఖర్చులు తగ్గుతున్నాయన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు ఆహారం అందిస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని, వీటిలో ఆధునిక తరగతి గదులు, క్రీడా మైదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించిందని తెలిపారు.
ఆరోగ్య రంగంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తున్నామని, అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు.
పటాన్చెరు వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు రూ.2 వేల స్టైఫండ్ అందించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొని, లబ్ధిదారుల కుటుంబంతో కలిసి భోజనం చేయడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
