హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్–2026
– 14 దేశాల నుంచి 110 మంది ప్రతినిధుల పాల్గొనడం
– కార్మిక సంక్షేమం, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధిపై మూడు రోజుల చర్చలు
– కార్మికుల భద్రతే పరిశ్రమల ఉత్పాదకతకు పునాది: మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, జూలై 14: హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో మంగళవారం ప్రతిష్ఠాత్మక బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్–2026 ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో కలిసి రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సదస్సును ప్రారంభించారు. జూలై 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ సదస్సు కొనసాగనుంది.
ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) మరియు ఆటోమేషన్ ప్రభావంతో ప్రపంచ కార్మిక రంగం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా కార్మికులకు సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, నిరంతర శిక్షణ అత్యవసరమని పేర్కొన్నారు.
కార్మికులు తమ ఉద్యోగ భద్రత, కుటుంబ భవిష్యత్తుపై విశ్వాసంతో ఉన్నప్పుడే పరిశ్రమల అభివృద్ధికి మరింత సమర్థంగా తోడ్పడగలరని చెప్పారు. అందువల్ల కార్మిక హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
సదస్సులో భవిష్యత్ ఉద్యోగాలు, సాంకేతిక మార్పులు, కార్మిక హక్కులు, సామాజిక భద్రత, ట్రేడ్ యూనియన్ల బలోపేతం వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. వివిధ దేశాల్లో అమలవుతున్న ఉత్తమ కార్మిక విధానాలను అధ్యయనం చేసి, వాటిని ఇతర దేశాలు అనుసరించేలా సిఫార్సులు రూపొందించడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) ఏర్పాటు చేసి, పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్దుతున్నామని వివరించారు.
అలాగే, ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఉన్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ సంస్థ టామ్‌కామ్ (TOMCOM) ద్వారా జర్మనీ, జపాన్, యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో తెలంగాణ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. దీనివల్ల యువతకు అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభించడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం అవుతుందని పేర్కొన్నారు.
ఈ మూడు రోజుల సదస్సులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), బెలారస్, మలేషియా, నైజీరియా సహా 14 దేశాల నుంచి సుమారు 110 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.
కార్మిక సంక్షేమం, సామాజిక న్యాయం, ఉపాధి భద్రత, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై విస్తృత చర్చలు నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన సిఫార్సులను రూపొందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లు పనిచేస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఈ అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది.
ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
