పులుల సంరక్షణలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలి: మంత్రి కొండా సురేఖ
పులిని కాపాడటం అంటే అడవిని, జీవవైవిధ్యాన్ని, భావితరాల భవిష్యత్తును కాపాడటమే – అంతర్జాతీయ పులుల దినోత్సవ వేడుకల్లో మంత్రి పిలుపు
హైదరాబాద్, జూలై 29: పులుల సంరక్షణ పట్ల సమాజంలోని అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ భూమి కేవలం మనుషుల ఆవాసం మాత్రమే కాదని, సమస్త జీవరాశుల ఉమ్మడి నివాసమని గుర్తించి ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని కోరారు.
అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దూలపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పులుల ఫోటో ప్రదర్శనను పరిశీలించి, పులుల సంరక్షణపై రూపొందించిన లఘు చిత్రాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. పులుల సంరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొందించేందుకు 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు ప్రకృతి పరిరక్షణకు గొప్ప వేదికగా మారిందన్నారు.
పులి అటవీ సంపదకు ప్రతీక అని పేర్కొన్న మంత్రి, పులిని పరిరక్షించడమంటే అడవులను, పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని, భావితరాల భవిష్యత్తును సంరక్షించడమేనని అన్నారు. వేట, అడవుల నరికివేత, అక్రమ రవాణా వంటి కారణాలతో ఒకప్పుడు పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిని మార్చేందుకు నాటి ప్రధాని ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చి, 1973లో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించడం ద్వారా దేశవ్యాప్తంగా పులుల సంరక్షణకు బలమైన చర్యలు చేపట్టిందని మంత్రి గుర్తుచేశారు. ఆ చర్యల ఫలితంగానే నేడు ప్రపంచంలోని మొత్తం పులుల్లో సుమారు 75 శాతం భారతదేశంలోనే ఉన్నాయని, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 58 టైగర్ రిజర్వులు విజయవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.
తెలంగాణ కూడా పులుల సంరక్షణలో విశిష్ట స్థానం సంపాదించిందని మంత్రి పేర్కొన్నారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులు దేశంలోనే అత్యంత ప్రాధాన్యమైన పులుల అభయారణ్యాలుగా గుర్తింపు పొందాయని చెప్పారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో నీటి వనరుల అభివృద్ధి, ఆవాసాల మెరుగుదల, ఆధునిక రక్షణ చర్యల వల్ల పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
కవ్వాల్ టైగర్ రిజర్వులో పులుల సంఖ్యను పెంచేందుకు టైగర్ రీ-ఇంట్రడక్షన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా కవ్వాల్ టైగర్ రిజర్వును మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వుతో అనుసంధానించి పులుల సహజ సంచారానికి అనుకూల పరిస్థితులు కల్పించినట్లు వివరించారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు అటవీ శాఖ విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు.
అడవులను కాపాడుదామని, వన్యప్రాణులను సంరక్షిద్దామని, భావితరాలకు పచ్చని తెలంగాణను అందిద్దామని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. పులుల సంరక్షణలో అటవీ శాఖతో పాటు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు.
తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన శిక్షణార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, అటవీ సంపద పరిరక్షణలో నిబద్ధత, నిజాయితీ, సేవాభావంతో పనిచేసి భావితరాలకు పచ్చని ప్రకృతిని అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసిన పలువురు అటవీ శాఖ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులను మంత్రి అందజేశారు. అలాగే అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి వినయ్ కుమార్, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ దండా రాజిరెడ్డి, పీసీసీఎఫ్ (డెవలప్‌మెంట్) రత్నాకర్ జౌహరి, సీసీఎఫ్ & తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ ప్రియాంక వర్గీస్, సీసీఎఫ్ ఎన్. క్షితిజ్, టైగర్ సెల్ రీసెర్చ్ సైంటిస్ట్ అయాన్ సాధు, అమ్రాబాద్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రసాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, అటవీ శాఖ అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.
