తెలంగాణ యువత నైపుణ్యాలకు జపాన్ సాంకేతికతను జోడిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
ఒసాకా, ఆగస్టు 25: తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి నైపుణ్యాలను అందించేందుకు జపాన్ సాంకేతికత, శిక్షణ విధానాలను రాష్ట్రంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్), గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. యూనివర్సిటీలు–పరిశ్రమల మధ్య బలమైన అనుసంధానంతోనే నైపుణ్యాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
జపాన్ పర్యటనలో భాగంగా సోమవారం మంత్రి వివేక్ వెంకటస్వామి, శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, టాంకాం జీఎం నాగభారతి తదితరులతో కలిసి కిండాయ్ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమై విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, సాంకేతిక సహకారం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ తదితర అంశాలపై చర్చించారు.
అణుబాంబు దాడుల విధ్వంసం నుంచి జపాన్ అద్భుతమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన తీరు ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని మంత్రి అన్నారు. జపాన్ అనుసరించిన క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత, పరిశోధన, విద్యాసంస్థలు–పరిశ్రమల సమన్వయం వంటి విధానాలను తెలంగాణలోనూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
జపాన్లో విద్యార్థులు యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే పరిశ్రమల అవసరాలు, ఆధునిక సాంకేతికత, ఉద్యోగ నైపుణ్యాలపై శిక్షణ పొందుతున్నారని మంత్రి తెలిపారు. కేవలం డిగ్రీలు అందించడం కాకుండా పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని విద్యాసంస్థల్లోనే కల్పించడం ద్వారా విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగాలు, పరిశ్రమల అవసరాలకు సిద్ధం చేస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో విద్యాసంస్థలు, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థల మధ్య మరింత బలమైన అనుసంధానం అవసరమని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ, పరిశోధన, ఇండస్ట్రీ ఆధారిత కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం జపాన్ సంస్థలతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణ ఏటీసీలకు జపాన్ సాంకేతిక సహకారం అందించేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. జపాన్ యూనివర్సిటీలు, పరిశ్రమలతో కలిసి సంయుక్త శిక్షణ, పరిశోధన, టెక్నాలజీ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలను చేపట్టి తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఇరుదేశాల విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు పరస్పరం తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా నూతన ఆవిష్కరణలకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. తెలంగాణ విద్యార్థులు జపాన్లోని యూనివర్సిటీల్లో ఉన్నత విద్య, సాంకేతిక శిక్షణ పొందేందుకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
అదే సమయంలో జపాన్ సంస్థల నైపుణ్య ప్రమాణాలు, శిక్షణ విధానాలను తెలంగాణలో అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రానున్న రోజుల్లో జపాన్లోని వివిధ పరిశ్రమలు, సంస్థలు, విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను జపాన్ పారిశ్రామికవేత్తలకు వివరించి మరిన్ని జపాన్ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని వివేక్ వెంకటస్వామి అన్నారు. పెట్టుబడులతో పాటు తెలంగాణ యువతకు నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
జపాన్ అనుభవాల నుంచి స్ఫూర్తి పొంది తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి నైపుణ్యాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. విద్య, నైపుణ్యం, పరిశోధన, పరిశ్రమలు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి తెలంగాణ యువతకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
