పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన పోరాడుతున్న బీఆర్‌ఎస్‌వీ
శక్తి స్కీమ్ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలి: సూర్యాపేటలో భారీ నిరసన
సూర్యాపేట: పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం తీసుకున్న శక్తి స్కీమ్ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు.
సూర్యాపేటలోని ఎస్‌వీ కళాశాల చౌరస్తాలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ నాయకులు, పాలిటెక్నిక్ విద్యార్థులు మాట్లాడుతూ.. ఆగస్టు 15న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న శక్తి స్కీమ్ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, శక్తి స్కీమ్‌ను ఉపసంహరించుకునే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని బీఆర్‌ఎస్‌వీ నాయకులు హెచ్చరించారు.
ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ధర్నాలు, నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు బంటు సందీప్, ఖమ్మంపాటి ఉదయ్, భూక్యా శ్రీనాథ్, చింతపల్లి సంపత్, ధరావాత్ బబ్లు, చామకూరి మహేందర్, ఎలగబోయిన వంశీతో పాటు పెద్ద సంఖ్యలో పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.
