జపాన్ సాంకేతిక విద్యా విధానాలపై తెలంగాణ ప్రత్యేక దృష్టి
ఫుకుయామా హయ్యర్ టెక్నికల్ స్కూల్‌ను సందర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
ఫుకుయామా, ఆగస్టు 26: వృత్తి విద్య, ప్రాక్టికల్ శిక్షణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిలో జపాన్ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం ఫుకుయామా హయ్యర్ టెక్నికల్ స్కూల్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా నిర్మాణ, టెక్నికల్, వెల్డింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ ల్యాబొరేటరీలను మంత్రి పరిశీలించి, అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడారు.
60 శాతం ప్రాక్టికల్ శిక్షణ
ఫుకుయామా హయ్యర్ టెక్నికల్ స్కూల్‌లో సుమారు 60 శాతం ప్రాక్టికల్, 40 శాతం థియరీ ఆధారంగా శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. విద్యార్థులతో పాటు గతంలో పని అనుభవం ఉన్నవారికి కూడా ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ శిక్షణ పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు.
నిర్మాణ రంగానికి సంబంధించిన ల్యాబ్‌లో నిర్మాణ పనులు, ఇంటీరియర్ వర్క్స్‌పై అందిస్తున్న శిక్షణను మంత్రి పరిశీలించారు. ఏడాది వ్యవధి గల కోర్సు ద్వారా ఉద్యోగాలకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలను అందిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు.
టెక్నికల్, వెల్డింగ్ ల్యాబ్‌లలో ప్రెసిషన్ వర్క్, ఫ్యాబ్రికేషన్, వివిధ విడిభాగాల అనుసంధానానికి ఉపయోగించే ఆధునిక యంత్రాలు, పరికరాలను పరిశీలించారు. పని ప్రదేశంలో క్రమశిక్షణ, భద్రత, రక్షణ పరికరాల వినియోగం, యంత్రాల నిర్వహణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని మంత్రి అభినందించారు.
పెట్రోల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలపై శిక్షణ
ఆటోమొబైల్ ల్యాబ్‌లో రెండేళ్ల కోర్సులో భాగంగా వాహనాల నిర్వహణపై విద్యార్థులకు ఇస్తున్న శిక్షణను మంత్రి పరిశీలించారు. పెట్రోల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలపై శిక్షణ అందిస్తూ ఆటోమొబైల్ రంగంలో మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న విధానాన్ని తెలుసుకున్నారు.
ఎలక్ట్రికల్ ల్యాబ్‌లో విద్యార్థులు విద్యుత్ వైరింగ్‌పై పొందుతున్న శిక్షణను పరిశీలించి వారితో మంత్రి ముచ్చటించారు. స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను రూపొందిస్తున్నట్లు పాఠశాల అధికారులు తెలిపారు.
తెలంగాణ–జపాన్ విద్యార్థుల మార్పిడికి కార్యాచరణ
వొకేషనల్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ డివిజన్ డైరెక్టర్ తకమురా రేకో, ఫుకుయామా హయ్యర్ టెక్నికల్ స్కూల్ ప్రిన్సిపల్, ఇండస్ట్రియల్ హ్యూమన్ రిసోర్సెస్ డివిజన్ డైరెక్టర్ ఫినోయిషి హిరోయోషితో మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు.
తెలంగాణ–జపాన్ సాంకేతిక విద్యాసంస్థల మధ్య విద్యార్థుల పరస్పర మార్పిడి, అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించేందుకు తక్షణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను నిర్ణీత కాలపరిమితిలో అమలు చేయడంతో పాటు సాంకేతిక విద్య, అధ్యాపకుల మార్పిడి, పాఠ్య ప్రణాళిక అభివృద్ధి, ప్రాక్టికల్ శిక్షణలో విస్తృత సహకారం అందించాలని మంత్రి సూచించారు.
జర్మనీ తరహాలో జపాన్‌కు ప్రత్యేక కార్యక్రమం
జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం తెలంగాణ యువతను సిద్ధం చేసేందుకు TOMCOM ఇప్పటికే విజయవంతమైన కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. అదే తరహాలో జపాన్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తెలంగాణ నుంచి సిద్ధం చేసేలా వ్యవస్థీకృత కార్యక్రమాన్ని రూపొందించవచ్చని చెప్పారు.
జపాన్‌లో నైపుణ్య కార్మికులకు భారీ డిమాండ్, ఉద్యోగ అవకాశాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ యువతకు అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను విద్య, ప్రాక్టికల్ శిక్షణ నుంచి జపాన్‌లో ఉద్యోగం వరకు స్పష్టమైన మార్గంగా రూపొందించాలని సూచించారు.
జపనీస్ భాష, సంస్కృతిపై ప్రత్యేక శిక్షణ
జపాన్‌లోని విద్యాసంస్థలు, పరిశ్రమల్లో తెలంగాణ యువత సులభంగా కలిసిపోయేలా జపనీస్ భాష, సంస్కృతి, పని విధానాలపై ప్రత్యేక శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
జపాన్‌కు సంబంధించిన ప్రతి శిక్షణ, ఉద్యోగ కార్యక్రమంలో భాషా ప్రావీణ్యం, సాంస్కృతిక అవగాహన, జపనీస్ పని విధానాలపై పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో సాంకేతిక శిక్షణను అభివృద్ధి చేయడం, విద్యార్థుల పరస్పర మార్పిడి, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల కల్పన, సంస్థల భాగస్వామ్యం, అంతర్జాతీయ వర్క్‌ఫోర్స్ మొబిలిటీ ద్వారా తెలంగాణ యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
