రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేస్తాం: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మే 25: చెన్నూర్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈసారి చెన్నూర్ ప్రాంతంలో వరి పంట అంచనాలకు మించి అధిక దిగుబడి రావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. దీంతో కొనుగోలు ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుందని తెలిపారు.
చెన్నూర్ ప్రాంతంలో ధాన్యం నిల్వ కోసం గోదాముల సౌకర్యాలను పెంచుతున్నామని, అదేవిధంగా హమాలీల సంఖ్యను కూడా పెంచుతున్నామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లారీలకు అదనంగా మరో 75 లారీలను కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
జిల్లా కలెక్టర్‌తో పాటు అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని మంత్రి తెలిపారు. రాబోయే వారం రోజుల్లో రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా, ఆలస్యం చేయకుండా తమ వరి ధాన్యాన్ని సమీప కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు.
