నషా ముక్త్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
మెదక్, అక్టోబర్ 7: డ్రగ్స్ రహిత భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమంలో భాగస్వాములు కావాలని శక్తి , గనుల శాఖ మంత్రి మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల ముఠాలు ప్రలోభాలకు గురిచేస్తున్న నేపథ్యంలో యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మెదక్ జిల్లా కేంద్రంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం IDOC ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను సందర్శించి, స్వయం సహాయక సంఘాల సభ్యులతో మాట్లాడారు.
గతంలో కేంద్ర మంత్రిగా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా విశేష సేవలందించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా.. హిమాచల్ ప్రదేశ్‌లో మత్తు పదార్థాల నిర్మూలనకు విశేష కృషి చేశారని మంత్రి వివేక్ తెలిపారు. రాష్ట్రంలోనూ గవర్నర్ చొరవతో ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుండటం అభినందనీయమన్నారు.
“డ్రగ్స్ ఇచ్చేది కేవలం క్షణికానందం మాత్రమే. కానీ వాటి వల్ల జీవితాంతం తీవ్ర నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తి మత్తు పదార్థాల బారిన పడితే అతని వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు.. మొత్తం కుటుంబం, సమాజం ప్రభావితమవుతుంది” అని మంత్రి అన్నారు.
యువతకు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని, బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకోవాలని యువత, విద్యార్థులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
మత్తు పదార్థాల నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రతి కుటుంబం, ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామి కావాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, గవర్నర్ సెక్రటరీ దాన కిషోర్, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
