రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల బలోపేతానికి ప్రభుత్వం కృషి
విద్య, పోషకాహారం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
గురుకులాల్లో మెస్ ఛార్జీలు 40 శాతం పెంపు
10 వేల మంది ఉపాధ్యాయుల నియామకం
శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
మందమర్రి, సెప్టెంబర్ 16: రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలను మరింత బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన పోషకాహారం, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌కు అవసరమైన సౌకర్యాలను దశలవారీగా మెరుగుపరుస్తున్నామని చెప్పారు.
మందమర్రిలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో షేర్ ది విజన్ ఫౌండేషన్ చైర్మన్ నారాయణ అందించిన స్కూల్ బ్యాగులను మంత్రి విద్యార్థినులకు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన ఆయన.. వారిలోని క్రమశిక్షణ, చదువుపై ఆసక్తి, ఉన్నత లక్ష్యాలు తనను ఆకట్టుకున్నాయని అన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
గురుకుల విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా గురుకులాల్లో మెస్ ఛార్జీలను 40 శాతం పెంచినట్లు వెల్లడించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వసతి తదితర రంగాల్లో విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం, దాతలు కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మందమర్రి గురుకుల పాఠశాల అభివృద్ధికి గతంలో డీఎంఎఫ్టీ నిధుల నుంచి రూ.30 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అవసరమైన అదనపు వసతుల కల్పనకు కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే 2 వేలకుపైగా పాఠశాలల్లో ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించేందుకు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఒక ప్రస్తుత పాఠశాలకు సైనిక్ స్కూల్ తరహా సౌకర్యాలు కల్పించే అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించినట్లు వెల్లడించారు.
క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వసతి తదితర సౌకర్యాలతో సోమనపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పదో తరగతిలో మెరిట్ సాధించే విద్యార్థులకు ఈ పాఠశాలలో మంచి అవకాశాలు లభిస్తాయని, వారి విద్యా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
విద్యార్థులు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు వంటి ఉన్నత లక్ష్యాలను సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా మంచి ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు.
