వచ్చే ఏడాది ప్రారంభం కానున్న రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారం ఈఎస్ఐ నర్సింగ్ కాలేజీ
మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ
హైదరాబాద్, జూలై 14: రామగుండంలో ప్రతిపాదిత 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారంలో ఈఎస్ఐ నర్సింగ్ కాలేజీ వచ్చే ఏడాది నుంచి సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, ఈ రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రిలో నూతన ఓపీడీ బ్లాక్‌ను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ నాయకత్వంలో ఈఎస్ఐసీ దేశవ్యాప్తంగా కార్మికులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కీలక అడుగులు వేస్తోందని అన్నారు.
తన తండ్రి, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి కాకా వెంకటస్వామి హయాంలో కూడా సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని సందర్శించానని, ఇప్పుడు రాష్ట్ర కార్మిక మంత్రిగా మళ్లీ సందర్శించినప్పుడు ఆస్పత్రిలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు తనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. పూర్తి స్థాయి కార్డియాక్ కేర్ సెంటర్, బైపాస్ శస్త్రచికిత్సలు, అత్యాధునిక డయాలసిస్ యూనిట్, క్యాన్సర్ చికిత్సా సౌకర్యాలు ఈఎస్ఐసీ సేవల విస్తరణకు నిదర్శనమని పేర్కొంటూ కేంద్ర మంత్రి, ఈఎస్ఐసీ అధికారులు, వైద్య సిబ్బందిని అభినందించారు.
తెలంగాణలో ప్రస్తుతం సుమారు 20 లక్షల మంది ఇన్ష్యూర్డ్ పర్సన్స్ (IPs), దాదాపు 80 లక్షల మంది లబ్ధిదారులు ఈఎస్ఐ సేవలు పొందుతున్నారని మంత్రి తెలిపారు. సనత్‌నగర్ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గించేందుకు రామచంద్రాపురం, నాచారం ఈఎస్ఐ ఆస్పత్రులను అత్యాధునిక వైద్య కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రామచంద్రాపురంలో కార్డియాక్ కేర్ సెంటర్‌తో పాటు 20 పడకల డయాలసిస్ యూనిట్, నాచారంలో ఇప్పటికే ఆమోదం పొందిన కార్డియాక్ సెంటర్‌తో పాటు 20 పడకల డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రామగుండం అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం అని పేర్కొన్న మంత్రి, అక్కడ పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి అత్యవసరమని వివరించారు. గతంలో ఆమోదం లభించినప్పటికీ టెండర్ ప్రక్రియ నిలిచిపోయిందని, దానిని వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, నిర్మాణ పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది నుంచే ఆస్పత్రిని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
విదేశీ ఉపాధి అవకాశాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం టామ్‌కామ్ (TOMCOM) ద్వారా దేశంలోనే ముందంజలో ఉందని మంత్రి వివేక్ తెలిపారు. జర్మనీ వంటి దేశాల్లో నర్సింగ్ సిబ్బందికి భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో, రాష్ట్రంలో కూడా నర్సుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నాచారం ఈఎస్ఐ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ కళాశాల ద్వారా శిక్షణ పొందిన నర్సులు ఈఎస్ఐ ఆస్పత్రులతో పాటు విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు పొందగలరని వివరించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి, నాచారం నర్సింగ్ కాలేజీని కూడా వచ్చే ఏడాది ప్రారంభిస్తామని ప్రకటించారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి, శంషాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయించిన ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలని, అలాగే మహబూబ్‌నగర్‌లో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. భవిష్యత్తులో వరంగల్ ప్రాంతంలో కూడా ఈఎస్ఐ ఆస్పత్రి అవసరం ఉంటుందని తెలిపారు.
భూ సమస్యల కారణంగా నిలిచిపోయిన 15 ఈఎస్ఐ డిస్పెన్సరీలకు మళ్లీ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వాటిని 12 నెలల్లో పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు.
దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఈఎస్ఐ ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులు డయాలసిస్ కోసం పట్టణాలకు రావాల్సిన పరిస్థితి ఉందని, అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తే కార్మికులు, వారి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
కార్మికుల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, తెలంగాణలో ఈఎస్ఐ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.
