వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్..

whatsapp image 2025 11 19 at 8.43.08 pm

వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్‌ శివశంకర్‌ పై సస్పెన్షన్ వేటు పడింది. ఓ పార్కు స్థలానికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో.. ఆయనపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వేటు వేసింది. కొన్ని నెలల క్రితమే ఇక్కడ పనిచేసిన రాజేశ్ అనే సబ్ రిజిస్ట్రార్ అనిశాకు చిక్కడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ క్రమంలో సీనియర్ అసిస్టెంట్ శివశంకర్‌‌కు సబ్ రిజిస్ట్రార్ ఇన్‌చార్జి‌గా బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. హయత్‌నగర్ మండలం సాహె బ్‌నగర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని 200 సర్వే నంబరులో వివాదానికి కారణమైన పార్కు స్థలం ఉంది.

ఈ ప్రాంతంలో పూర్వకాలంలో ఉన్న లే అవుట్(అనధికారిక) ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పలువురు వివిధ కోర్టులను ఆశ్రయించి అనుమతులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్కు ఉన్న ప్రాంతానికి కూడా బై నంబరుతో కొందరు రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయగా సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. ఈ వ్యవహారంపై స్థానికులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు.

పార్కు స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో విచారణ చేయించగా.. పలు డాక్యుమెంట్లకు ఒకే ప్రాంతం ఫొటోలు చూపించినా రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం, పార్కు స్థలం ఉన్నట్లు స్థానికులు ఫిర్యాదు చేసినా సబ్‌రిజిస్ట్రార్ ఉదాసీనంగా వ్యవహరించినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్‌ శివశంకర్‌‌‌ తప్పు ఉందని విచారణలో తేలడంతో సస్పెండ్ చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల అవినీతి నిరోధక శాఖ దాడుల నేపథ్యంలో కార్యాలయాల్లో ఉన్న లోపాలపై ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. కీలక సంస్కరణలు తీసుకొస్తున్నప్పటికీ అధికారులు, సిబ్బంది మారకపోవడంపై అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *